: ఐఎస్ఐఎస్ వలలో పడతారు.. జాగ్రత్త!: ఫేస్ బుక్ యూజర్లకు హెచ్చరికలు
మీరు ఫేస్ బుక్ లో పోటోలు, వీడియోలను, పోస్ట్ చేయడం లేదా షేర్ చేయడం లేదా ఎవరైనా చేసిన పోస్టులకు లైక్ కొడుతున్నారా? అయితే, మీకు పోలీసులు కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. ఫేస్ బుక్ ఖాతాదారులు కొట్టే లైక్స్ లేదా షేర్ చేసే పోస్టింగ్స్ పైనే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల సైబర్ వింగ్స్ దృష్టి సారించాయని, వీరి నుంచి షార్ట్ లిస్టు చేసుకుని, ఆకర్షిస్తూ యువకులను రిక్రూట్ చేసుకుంటోందని తెలిపారు. ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయని, కేరళలో 21 మంది యువకులు కనిపించకుండా పోగా, వారంతా ఇస్లామిక్ స్టేట్స్ లో ఉన్నట్టు గుర్తించామని తెలిపారు.
సామాజిక మాధ్యమాల ఆధారంగానే ఉగ్రవాద సంస్థ యువతను టార్గెట్ చేస్తుందని తెలిపారు. ఈ సైబర్ వింగ్ కొన్ని ఫేస్ బుక్ ఖాతాలను నిర్వహిస్తూ, కొన్ని వ్యాసాలు, వీడియోలను పోస్టు చేస్తున్నట్టు తిరువనంతపురం రేంజ్ ఐజీ మనోజ్ అబ్రహ్మం చెప్పారు. వారు చేసే పోస్టులను లైక్ చేసిన వారితో కాంటాక్ట్ అవుతూ వారిని రిక్రూట్ చేసుకుంటున్నట్టు తెలిపారు. తప్పుడు ఐడీలతో ఆన్ లైన్ లో కార్యకలాపాలు జరుపుతున్న వారిని పోలీసు సైబర్ వింగ్ గుర్తిస్తుందని తెలిపారు. కేరళలో మిస్ అయిన వారంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నవారేనని తేలినట్టు స్పష్టం చేశారు.