: ఎన్ని ఆటంకాలు ఎదురైనా ‘అనంత’ నుంచి పోటీ చేయడం ఖాయం: పవన్ కల్యాణ్
ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయడం ఖాయమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ కోసం స్పీకర్లు, కంటెంట్ రైటర్లు, అనలిస్టులుగా సేవలందించేందుకు అనంతపురం జిల్లా నుంచి వచ్చిన నూతన నాయకులు పవన్ కల్యాణ్ ని కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో సుమారు నూట యాభై మందికి పైగా ప్రతినిధులు ఆయనతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, తన తుదిశ్వాస విడిచే వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిని కాదని కొందరు విమర్శిస్తున్నారని, అసలు పూర్తి స్థాయి రాజకీయ నాయకులు ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లోకి వచ్చినా వ్యాపారాల్లో రూ.కోట్లు సంపాదించుకుంటున్నారని, అవసరమైతే తాను సినిమాల్లో నటించడం వాయిదా వేసుకుంటానని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో త్వరలో తాను పాదయాత్ర చేయనున్నట్టు ఈ సందర్భంగా పవన్ ప్రకటించారు.