: మధ్యప్రదేశ్ లో పరీక్షల్లో తప్పడంతో... 12 మంది విద్యార్థుల ఆత్మహత్య
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం టెన్త్, ఇంటర్ ఫలితాలు శుక్రవారం నాడు విడుదల కాగా, ఫెయిలయ్యామన్న మనస్తాపంతో 12 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో ఆరుగురు అమ్మాయిలున్నారు. ఇంటర్ లో 72 శాతం మంది బాలికలు, 64 శాతం మంది బాలురు, టెన్త్ లో 51 శాతం మంది బాలికలు, 48 శాతం మంది బాలురు ఉత్తీర్ణులైనట్టు రాష్ట్ర విద్యా శాఖ ప్రకటించింది. ఆపై ఒకే ఇంటిలో ఇంటర్, టెన్త్ చదువుతున్న అక్కా తమ్ముళ్లు రష్మీ (18), దీపేంద్ర (15)లు పరీక్ష తప్పామన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. జబల్ పూర్ లో ఓ విద్యార్థిని అనుకున్నన్ని మార్కులు రాలేదని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. భోపాల్ లో నమన్ కడ్వే అనే పదవ తరగతి విద్యార్థి 90 శాతం మార్కులు వస్తాయని భావించగా, 74 శాతం మార్కులే రావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక తమకు సరైన మార్కులు రాలేదని ఫిర్యాదు చేస్తూ, సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు హెల్ప్ లైన్ కు ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి.