: పబ్ డ్యాన్సర్ పై సామూహిక అత్యాచార యత్నం... హైదరాబాద్ శివార్లలో కలకలం!
పబ్బుల్లో డ్యాన్స్ చేస్తూ, పొట్ట పోసుకుంటున్న ఓ యువతి (20)పై తెలిసిన వ్యక్తులే సామూహిక అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన హైదరాబాద్ శివార్లలో కలకలం సృష్టించింది. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘట్ కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సీతాఫల్ మండికి చెందిన యువతి రాత్రి 10 గంటల సమయంలో తనకు కొంతకాలంగా పరిచయం ఉన్న రవి అనే క్యాబ్ డ్రైవర్ తో కలసి ఉప్పల్ బయలుదేరింది.
మార్గమధ్యంలో రవికి పరిచయస్థులైన మరో ముగ్గురు యువకులు కారులో ఎక్కారు. ఉప్పల్ లో వీరు బీరు కొనుగోలు చేసి, ఆపై నారపల్లి - చౌదరిగూడ మార్గానికి కారును తీసుకెళ్లారు. అక్కడ తాము తెచ్చుకున్న బీర్లను ఖాళీ చేసి, ఆపై డ్యాన్సర్ పై అత్యాచారానికి ప్రయత్నించారు. ఆమె కేకలు పెట్టడంతో వెనక్కు తగ్గి ఆమెను రోడ్డుపై వదిలేసి పారిపోయారు. సాయం కోసం బాధితురాలు 100కు ఫోన్ చేసింది. దీంతో అక్కడికి దగ్గర్లోనే ఉన్న మేడిపల్లి పోలీసులు స్పందించి, ఆమె వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.