: ఇప్పటికీ ఇందిరా గాంధీయే ప్రజల ప్రధాని: ప్రణబ్ ముఖర్జీ కీలక వ్యాఖ్య
నేటికీ ఇండియాలో అత్యధికుల ఆదరణను పొందిన ప్రధాని ఇందిరా గాంధీయేనని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆమె పాలనా దక్షత అమోఘమని, నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె చూపే వేగం తననెంతో ఆకర్షించేదని చెప్పుకొచ్చారు. 1970వ దశకంలో కాంగ్రెస్ విడిపోయి, అధికారాన్ని కోల్పోయిన వేళ, ఆమె తన మెదడుకు పదును పెట్టి, తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నారని అన్నారు.
ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులతో కలసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణబ్, ప్రసంగిస్తూ, 20వ శతాబ్దపు నేతల్లో ప్రపంచం గుర్తుంచుకున్న అతి కొద్ది మందిలో ఇందిర కూడా ఉన్నారని, ఆమె మన మధ్య లేకున్నా, ఆమె పాలన ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా అన్సారీ ఆవిష్కరించిన 'ఇండియాస్ ఇందిర - ఏ సెంటేనియల్ ట్రిబ్యూట్' పుస్తకం తొలి ప్రతిని ప్రణబ్ అందుకున్నారు. ఇదే సభలో రాహుల్ మాట్లాడుతూ, తనతో ఇందిర ఓ స్నేహితురాలిగా మెలిగే వారని గుర్తు చేసుకుంటూ, తనకు మార్గదర్శి ఆమేనని వ్యాఖ్యానించారు.