: రేపు మరోసారి తగ్గనున్న పెట్రోలు ధర!
అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా పక్షం రోజులకోసారి పెట్రోలు, డీజిల్ ధరలను సవరిస్తున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు, రేపు మరోసారి ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించనున్నాయి. ఇప్పటికే ఐదు నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలను రోజువారీగా సవరిస్తున్న కంపెనీలు గత పది హేను రోజుల వ్యవధిలో ధరలను తగ్గిస్తూ రావడమే ఇందుకు కారణం.
ఇండియన్ ఆయిల్ వెబ్ సైట్ లోని వివరాల ప్రకారం, విశాఖపట్నంలో నేటి పెట్రోలు ధర లీటరుకు రూ. 70.50 కాగా, డీజిల్ ధర రూ. 60.70. ఇదే సమయంలో హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 72.68, డీజిల్ ధర రూ. 62.53గా ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో రేపటి ప్రకటనలో రూ. 2 వరకూ ధరలను తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయాన్ని ప్రకటిస్తాయని అంచనా. అదే జరిగితే, ఈ సంవత్సరం జనవరిలో రూ. 75.37గా ఉన్న లీటర్ పెట్రోలు ధర ఐదు నెలల వ్యవధిలో రూ. 5 మేరకు తగ్గినట్టు అవుతుంది.