: రెండుగా చీలిన హిజ్బుల్... జకీర్ ముసా నేతృత్వంలో కొత్త ఉగ్ర సంస్థ!
పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న హిజ్బుల్ ఉగ్రవాద సంస్థ రెండుగా చీలిపోయింది. కాశ్మీర్ లోయలో ఆ సంస్థ టాప్ కమాండర్ జకీర్ ముసా, తాను హిజ్బుల్ ను వీడుతున్నట్టు స్పష్టం చేశాడు. ఈ మేరకు ఓ ఆడియో మెసేజ్ ని పంపుతూ, హురియత్ నేతలపై విమర్శలు గుప్పించాడు. కాశ్మీరు అంశాన్ని వేర్పాటు వాద నేతలు రాజకీయంగా వాడుకుంటున్నారని, అసలు లక్ష్యాన్ని వారు ఎన్నటికీ సాధించలేరని ఆరోపించాడు. హిజ్బుల్ సైతం వేర్పాటు వాదులకు అండగా ఉంటోందని అన్నాడు.
సిరియాలో ఐఎస్ఐఎస్ స్థాపించిన కాలిఫేట్ ను జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభించి, స్వీయ పరిపాలన సాగించాలన్నదే తన లక్ష్యమని, హురియత్ నేతల తలలను శ్రీనగర్ లాల్ చౌక్ లో బహిరంగంగా నరుకుతానని వ్యాఖ్యానించాడు. ఆజాదీ కోసం కొత్త సంస్థ త్వరలో ఉద్భవిస్తుందన్నాడు. కాగా, ఈ ఆడియో టేపులను పరిశీలిస్తున్నామని జమ్మూ కాశ్మీర్ పోలీస్ చీఫ్ ఎస్పీ వెయిద్ పీటీఐకి తెలిపాడు. ఇది జకీర్ ముసా గొంతేనని తేలిందని, మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.