: మాట వినకుంటే ఏపీకి బదిలీ చేస్తానన్న ట్రాన్స్ కో ఉన్నతాధికారి... ఆత్మహత్యాయత్నం చేసిన ఉద్యోగిని
ఉన్నతాధికారి లైంగిక వేధింపులకు తాళలేక, తీవ్ర మనస్తాపంతో ఆర్టీసీ బస్సులో నిద్రమాత్రలు మింగిన ఓ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఉప్పల్ ప్రాంతంలో నివాసముండే బాధితురాలు (33) ఖైరతాబాద్ లోని ఏపీ ట్రాన్స్‌కో లిఫ్టిరిగేషన్ విభాగంలో టైపిస్ట్ గా పని చేస్తోంది. అదే ఆఫీసులో సూపరింటెండెంట్ గా పని చేస్తున్న వీడీబీ శ్రీనివాస్, ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. తన మాట వినకుంటే, ఆంధ్రప్రదేశ్ కు ట్రాన్స్ ఫర్ చేయిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
అతని వేధింపులను తట్టుకోలేనని భావించిన ఆ యువతి, కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్సులో ఇంటికి వెళుతూ, హిమాయత్ నగర్ ప్రాంతంలో బస్సులోనే నిద్రమాత్రలు మింగింది. దీన్ని గమనించిన తోటి ప్రయాణికులు ఆమెను సమీపంలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆమె ఫిర్యాదు మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు.