: చిన్ననాటి కోరికంటూ మురళీమోహన్... తనకు ఎప్పటి నుంచో ఆసక్తి ఉందని రాయపాటి... చంద్రబాబు వద్ద 'టీటీడీ చైర్మన్' పదవి పంచాయితీ!
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పదవీకాలం పూర్తికావడంతో, ఆ పదవి తమకు దక్కాలని పోటీ పడుతున్న నటుడు, ఎంపీ మురళీమోహన్, మరో ఎంపీ రాయపాటి సాంబశివరావులు చంద్రబాబును విడివిడిగా కలిసి తమ కోరికను వెల్లడించారు. టీటీడీ చైర్మన్ గా పని చేయడం తన చిన్ననాటి కలని మురళీమోహన్ వెల్లడించగా, ఆ పదవిపై తనకు ఎన్నో సంవత్సరాలుగా ఆసక్తి ఉందని రాయపాటి పేర్కొనడం గమనార్హం.
సీఎంతో భేటీ అనంతరం మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ, 26 నుంచి జరిగే తానా సభలకు తనకు ఆహ్వానం రావడంతో, వెళ్లేందుకు చంద్రబాబు అనుమతి తీసుకునేందుకు వచ్చానని చెప్పారు. ఇక రాయపాటి మాట్లాడుతూ, యూఎస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని, రాష్ట్రానికి కొత్త కంపెనీలను తెచ్చిన ముఖ్యమంత్రిని అభినందించేందుకు వచ్చానని వెల్లడించారు. ఇద్దరు నేతలూ టీటీడీ చైర్మన్ పదవి తనకు ఇవ్వాలంటే తనకు ఇవ్వాలని చంద్రబాబును కోరినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అవకాశముంటే పరిశీలిస్తానని చెప్పిన చంద్రబాబు, ఎవరికీ స్పష్టమైన హామీని మాత్రం ఇవ్వలేదని సమాచారం.