: ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 108కి కాలదోషం.. ఇక కేంద్రం జోక్యం ఉండనట్టే!


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇక నుంచి ఎటువంటి పొరపొచ్చాలు వచ్చినా కేంద్రం జోక్యం ఉండదు. గొడవలను ఇద్దరూ కలిసి చర్చించుకుని పరిష్కరించుకోవాల్సిందే. జోక్యానికి రాష్ట్రపతి అస్సలు ముందుకురారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 108కి రెండు వారాల్లో కాలదోషం పట్టబోతోంది. జూన్ 2 నుంచి అది ఉన్నా లేనట్టే లెక్క. ఈ సెక్షన్ ముగిసే సమయం ఆసన్నమవుతున్నా అటు తెలంగాణ ప్రభుత్వం కానీ, ఇటు ఏపీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. రాష్ట్ర విభజన సందర్భంగా అధికారాల నుంచి అప్పుల వరకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం 2014లో పునర్ వ్యవస్థీకరణ చట్టంలో 107 సెక్షన్ ను పెట్టారు. అయితే వాటి అమలులో సమస్యలు, గందరగోళాన్ని రాష్ట్రపతి తన స్వీయ విచక్షణాధికారాన్ని ఉపయోగించి పరిష్కరించవచ్చంటూ సెక్షన్ 108ను చేర్చారు.

నిజానికి చట్టం అమలులో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడానికి ఓ సెక్షన్‌ను చేర్చడం బ్రిటిష్ హయాం నుంచి ఆనవాయితీగా వస్తోంది. మూడేళ్లలో ఈ సెక్షన్ ఇప్పటి వరకు మూడుసార్లు మాత్రమే ఉపయోగిపడింది. పోలవరం ముంపు మండలాలు, తెలంగాణ శాసనమండలికి శాసనసభ కోటా, స్థానిక సంస్థల నియోజకవర్గాల విషయం... వంటి అంశాలలో రాష్ట్రపతి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి సమస్యలను పరిష్కరించారు.  అయితే జూన్ 2తో ఈ సెక్షన్ మూడేళ్ల కాలపరిమితి ముగిసిపోతుంది. ఈ క్లాజు ఉన్నప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు సమస్యల పరిష్కారం విషయంలో కేంద్రం అంటీముట్టనట్టు వ్యవహరిస్తోంది. ఇక ఈ క్లాజు కాలపరిమితి ముగిసిపోయిన తర్వాత ఏమిటన్నదే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రశ్న.

  • Loading...

More Telugu News