: కొత్త ఈ-మెయిల్స్ క్లిక్ చేయకూడదు.. ఎలాంటి వీడియోలు, అటాచ్మెంట్లు డౌన్లోడ్ చేయద్దు: హైదరాబాద్ పోలీస్‌శాఖ ఐటీసెల్ విభాగం
కంప్యూటర్లను ‘రాన్సమ్ వేర్’ వైరస్‌తో దాడి చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా హ్యాకర్లు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. సుమారు 100 దేశాలు ఈ హ్యాకింగ్ బారిన పడడంతో సైబర్ పోలీసులు తమ పరిధిలోని యూజర్లకు పలు సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్‌శాఖలోని ఐటీసెల్ విభాగం అధికారులు అన్ని విభాగాలను అప్రమత్తం చేస్తూ డేటా తస్కరణకు గురికాకుండా అన్ని సాంకేతిక, కంప్యూటర్ విభాగాల ఆపరేటర్లను పోలీసు అధికారులు అప్రమత్తం చేయాలని సూచించింది.
తెలియని ఈ-మెయిల్ నుంచి వచ్చిన కొత్త సందేశాలను వ్యక్తిగతంగా కూడా క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. అలాగే, యూజర్లు కంప్యూటర్లలో ప్రస్తుతం ఎలాంటి వీడియోలు, అటాచ్మెంట్లు డౌన్లోడ్ చేయవద్దని కూడా సూచించింది. కంప్యూటర్లలోని డేటాను బ్యాకప్ చేయడానికి పెన్‌డ్రైవ్ లేక ఇతర మార్గాలను ఉపయోగించాలని చెప్పింది. తమ కంప్యూటర్ హ్యాక్ వంటి ప్రమాదాలకు గురవుతుందని అనుమానం వస్తే తక్షణమే లాన్ కేబుల్ తొలగించాలని చెప్పింది. మరిన్ని వివరాలు, అనుమానాల నివృత్తి కోసం ఐటీ సెల్ విభాగాన్ని సంప్రదించవచ్చని పోలీసు అధికారులకు తెలిపింది.