: కవితమ్మ అర్ధగంట చీరలు అమ్మితే రూ.10 లక్షలు వస్తాయి.. మరి మిర్చి ఎందుకు అమ్మిపెట్టరు?: రేవంత్ రెడ్డి
'కూలీ దినాలు' అంటూ ఇటీవల టీఆర్ఎస్ నేతలు నానా హంగామా చేశారని, రైతుల కష్టాలను మాత్రం పట్టించుకోవడం లేదని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు ఖమ్మంలో టీటీడీపీ నిర్వహించిన రైతు దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘ఎంపీ కవితమ్మ అర్ధగంట చీరలు అమ్మితే రూ.10 లక్షలు వస్తాయి.. మంత్రి హరీశ్ రావు ఆరు లక్షల రూపాయలకు ఓ బస్తా మోస్తారు. మంత్రి కేటీఆర్ ఐదున్నర లక్షలకు ఐస్ క్రీములు అమ్మారు... మరి ఇంత అద్భుత నైపుణ్యం ఉన్న మీరు పదివేల రూపాయలకు ఒక క్వింటాల్ మిర్చి అమ్మలేరా? అని అడుగుతున్నా.. రైతులు కష్టపడి పండించిన పంటలను ఎందుకు అమ్మిపెట్టరు?’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
సినిమాలో 'రాసుకోరా సాంబా' అంటే ఒకడు హీరో చెప్పిందంతా రాసుకుంటాడని, అలాగే కేసీఆర్ చెప్పింది రాయడానికి ఓ తెలంగాణ పేపర్ వచ్చిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతులకు బేడీలు వేస్తే కనీసం వారి బొమ్మ కూడా అందులో ఇవ్వలేదని, మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు ఫొటో వేసి ప్రతిపక్షాలకు పిచ్చి పట్టుకుందని ఆయన చెప్పిన మాటలను వేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు.