: రేపు ఉదయం జగన్ ను జైల్లో కలుస్తా: దాడి
తెలుగుదేశం పార్టీకి గుడ్ బై కొట్టిన దాడి వీరభద్రరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవైపు అడుగులు వేస్తున్నారు. రేపు ఉదయం వైఎస్ జగన్ ను చంచల్ గూడ జైలులో కలుస్తానని విశాఖలో ఈ రోజు దాడి మీడియాకు తెలిపారు. జగన్ ను కలిసి మాట్లాడాక వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే.. తనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు నమ్మకం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పాదయాత్రకు దూరంగా పెట్టారన్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశాన్ని వీడుతున్నానని చెప్పారు.
అంతకుముందు దాడి కార్యకర్తలతో సమావేశమయ్యారు. తెలుగుదేశాన్ని వీడవద్దంటూ కార్యకర్తలు గట్టిగా కోరారు. అయినా దాడి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరాలని బలంగా నిర్ణయించుకున్నట్లు ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. అయితే, జగన్ తో చర్చలు ఫలించకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని దాడి సంచలన ప్రకటన చేయడం విశేషం. ప్రత్యర్థి కొణతాల వర్గీయులు పార్టీలోకి రాకుండా అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల వల్లే ఇలా ప్రకటించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.