: అమెరికాను వణికిస్తున్న ల్యాప్‌టాప్‌లు.. ల్యాపీలపై నిషేధం విస్తరించే యోచన!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వాన్ని ల్యాప్‌టాప్‌లు వణికిస్తున్నాయి. ఉగ్రవాదులు వాటిలో బాంబులు అమర్చి విమానాలను పేల్చివేసే ప్రమాదముందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో ఎలక్ట్రానిక్ వస్తువులపై ఇది వరకే విధించిన నిషేధాన్ని విస్తరించాలని యోచిస్తోంది. ఐరోపా దేశాల నుంచి వచ్చే విమానాల్లో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్, పోర్టబుల్ ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై నిషేధం విధించేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
పది ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు సెల్‌ఫోన్ కంటే పెద్దగా ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావడంపై మార్చిలోనే బ్రిటన్, అమెరికా దేశాలు నిషేధం విధించాయి. తాజాగా ల్యాప్‌టాప్‌లలో అమర్చే బాంబులను ఉగ్రవాద సంస్థ ఐసిస్ అభివృద్ధి చేస్తోందన్న సమాచారంతో ఉలిక్కి పడిన అమెరికా ఐరోపా దేశాలకు కూడా నిషేధాన్ని విస్తరించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు ఈ ప్రతిపాదనను అంతర్గత భద్రత శాఖ పరిశీలిస్తోంది. నిషేధం అమలు కోసం విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు అంతర్గత భద్రత శాఖ అధికార ప్రతినిధి డేవిడ్ లపాన్ తెలిపారు.