: నయీం దేశ సేవకుడు!: కలకలం రేపుతున్న సస్పెన్షన్ కు గురైన ఏసీపీ స్థాయి అధికారి వ్యాఖ్యలు
తెలంగాణలో కలకలం రేపిన గ్యాంగ్ స్టర్ నయీంతో అంటకాగిన నలుగురు పోలీసు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ కు గురైన అధికారుల్లో ఓ ఏసీపీ స్థాయి అధికారి బాహాటంగా నయీమ్ ను పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు పెనుకలకలం రేపుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే... 'నయీమ్ దేశానికి ఎంతో సేవచేశాడు. నయీంను ఉపయోగించుకుని సీనియర్ ఐపీఎస్ లు కోట్లు గడించారు. అలాంటి వారిని వదలి మాలాంటి వారిపై పడితే, ఇన్నాళ్లు రహస్యంగా ఉన్న చాలా విషయాలు బయటపెట్టాల్సి ఉంటుంది. నయీమ్ ఎంతో మంది ఉగ్రవాదులను పట్టించాడు. అతడి పేరు చెప్పుకుని పదవులు పొందిన రిటైర్డ్, ప్రస్తుత ఐపీఎస్ లను కూడా విచారించాలి. నయీం మావోయిస్టులకు చెందిన డంప్ లు పట్టించిన కేసులు, గుజరాత్ తో పాటు దేశంలోనే హాట్ టాపిక్ గా మారిన సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసు వంటి అనేక సంచలన కేసులు తిరగదోడాల్సి వస్తుంది. ఇప్పుడున్న పోలీసు అధికారులకు అంత ధైర్యం లేదు. కేవలం పోలీసు శాఖ పరువు పోతుందనే మా మీద వేటు వేసి, చేతులు దులుపుకున్నారు'. అని ఆయన సూటిగా స్పష్టంగా ఆరోపణలు చేశారు.