: గ్యాంగ్‌స్టర్ నయీం దందా కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఎమ్మెల్సీ నేతి అరెస్ట్‌కు రంగం సిద్ధం!
గ్యాంగ్‌స్టర్ నయీంతో అంటకాగిన నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. నయీంతో ‘క్లోజ్’గా ఉన్నట్టు నిర్ధారణ కావడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌లను అరెస్ట్ చేసేందుకు పోలీసులు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. నయీం కేసులో ఇప్పటికే విద్యాసాగర్‌ను విచారించిన పోలీసులు ఆయనతోపాటు మరికొంతమంది నేతలపైనా చర్యలకు సిద్ధమవుతున్నారు. అలాగే 20 మంది పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
నయీంతో రాసుకుపూసుకు తిరిగిన మద్దిపాటి శ్రీనివాస్ (అడిషన్ ఎస్పీ, సీఐడీ), చింతమనేని శ్రీనివాస్ (సీసీఎస్ ఏసీపీ), మలినేని శ్రీనివాస్ (ఏసీపీ మీర్‌చౌక్), మస్తాన్ (సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ), రాజ్‌గోపాల్ (సీఐ కొత్తగూడెం) తదితరులపై పోలీస్ శాఖ గురువారం వేటు వేసింది. ఇక మిగిలింది రాజకీయ నేతలే కాబట్టి వారిపైనా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో ముందుకే వెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కూడా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు 25 మంది సిబ్బందిపై వేటువేసిన పోలీసు శాఖ వారిపై శాఖాపరమైన విచారణ జరిపించేందుకు సిద్ధమవుతోంది. విచారణలో వారు కనుక దోషులుగా తేలితే విధుల నుంచి తొలగించడంతోపాటు కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.