: ‘హాజీ మస్తాన్’ బయోపిక్ నేపథ్యంలో... రజనీకాంత్‌కు ముంబై నుంచి నోటీసులు!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో ‘హాజీ మస్తాన్’ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆశ్చర్యకరమై సంఘటన ఒకటి జరిగింది. అయితే, హాజీ మస్తాన్ తనకు గాడ్ ఫాదర్ అని చెప్పుకుంటున్న సుందర్ శేఖర్ అనే వ్యక్తి రజనీకాంత్ కు నోటీసులు పంపారు. ఆ నోటీసుల్లో ఏమన్నారంటే.. హాజీ మస్తాన్ స్థాపించిన భారతీయ మైనారిటీ సురక్షా మహా సంఘానికి తాను జాతీయ అధ్యక్షుడినని ఆయన చెప్పుకున్నారు.
పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో హాజీ మస్తాన్ ను ఓ స్మగ్లర్ గానో, అండర్ వరల్డ్ డాన్ గానో చిత్రీకరించాలని అనుకుంటున్నట్టు తనకు తెలిసిందని పేర్కొన్నారు. హాజి మస్తాన్ ప్రముఖ జాతీయ రాజకీయ నాయకుడని, హాజీ మస్తాన్ జీవిత చరిత్రపై సినిమా తీయాలనుకుంటే తాను అన్ని విషయాలు చెబుతానని అన్నారు.
తాను ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లో జీవితకాల సభ్యుడినని, తనకు కూడా తన గాడ్ ఫాదర్ జీవిత చరిత్రపై ఓ సినిమా తీయాలని ఉందని అన్నారు. హాజీ మస్తాన్ ను ఓ స్మగ్లర్ గా చిత్రీకరించాలనే ప్రయత్నాలు ఏమైనా జరిగితే తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆ నోటీసులో హెచ్చరించారు. కాగా, మన దేశంలో తొలినాళ్లలో అండర్ వరల్డ్ డాన్ గా పేరుపొందిన వ్యక్తి హాజీ మస్తాన్. ముంబైలో నాడు చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన వ్యక్తిగా ఆయనకు పేరుంది.