: విమానంలో తేలు... మూడు గంటల ఆలస్యం!
విమానంలో ఓ తేలు కనిపించి, ఆ విమానాన్ని మూడు గంటలు ఆలస్యంగా బయల్దేరేలా చేసింది.. విమానం బయలుదేరడానికి ముందు ఒక ప్రయాణికుడి దుస్తుల మీదుగా ఓ తేలు పాక్కుంటూ వెళ్లడంతో అందులో కూర్చున్న ప్రయాణికులంతా ఆందోళన చెందారు. ఆ తేలు విమానంలో ఎవరినీ కుట్టలేదని సంబంధిత అధికారులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే... అమెరికాలోని హ్యూస్టన్ నగరం నుంచి ఈక్వెడార్‌లోని క్విటో నగరానికి వెళ్లాల్సిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ విమానం గేటు నుంచి కొద్ది దూరం వెళ్లింది. అంతలో తేలు విషయం తెలియగానే మళ్లీ దాన్ని వెనక్కి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న విమానయాన సిబ్బంది ప్రయాణికులందరినీ విమానం నుంచి దించేశారు. ఆ విమానంలో ఆ తేలు ఎక్కడుందో గుర్తించి, దాన్ని విమానం నుంచి దూరంగా తీసుకెళ్లడానికి మూడు గంటలు పట్టింది.