: ఇస్లామాబాద్ హైకోర్టు జడ్జి ఫోటో తీసిన భారత దౌత్యవేత్త.. ఫోన్ ను స్వాధీనం చేసుకున్న హైకోర్టు!
పాకిస్థాన్ లోని భారత హైకమిషన్ లో ఫస్ట్ సెక్రటరీ గా ఉన్న పీయూష్ సింగ్ ఫోన్ ను ఇస్లామాబాద్ హైకోర్టు స్వాధీనం చేసుకుంది. పాకిస్థాన్ మీడియా నివేదిక ప్రకారం, భారత్ కు చెందిన ఉస్మా అనే మహిళ కేసు విషయమై ఇస్లామాబాద్ హైకోర్టుకు పీయూష్ సింగ్ ఈ రోజు హాజరయ్యారు. కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో తన మొబైల్ ఫోన్ తో జడ్జి ఫోటోను పీయూష్ సింగ్ తీశారు. ఈ విషయం జడ్జికి తెలియడంతో, నిబంధనలు అతిక్రమించిన పీయూష్ సింగ్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించినట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో లిఖిత పూర్వకంగా క్షమాపణలు తెలపాలని పీయూష్ సింగ్ ను కోర్టు ఆదేశించింది.
కాగా, తన తలకు రివాల్వర్ గురిపెట్టి, తనను ఓ పాకిస్తానీకి ఇచ్చి పెళ్లి చేశారంటూ భారత్ కు చెందిన ఉస్మా అనే మహిళ ఆరోపిస్తూ అక్కడి భారత హైకమిషన్ ను ఇటీవల ఆశ్రయించింది. ఖైబెర్-ఫఖ్తుంక్వాకు చెందిన తహిర్ అలీ అనే వ్యక్తి తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ ఇస్లామాబాద్ హైకోర్టును ఉజ్మా ఆశ్రయించింది. తనను పెళ్లి చేసుకునే నాటికి తహిర్ అలీకి అప్పటికే ఓ వివాహమైందని, నలుగురు పిల్లలు కూడా ఉన్నారని పేర్కొంది. ఇదే విషయమై భారత హై కమిషన్ ను ఆశ్రయించిన ఉజ్మా, తనకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని, భారత్ కు వెళ్లేందుకు సాయం చేయాలని పీయూష్ సింగ్ ను కోరింది. అయితే, ఈ కేసు విచారణ నిమిత్తం ఇస్లామాబాద్ హైకోర్టుకు సదరు దౌత్యాధికారి వెళ్లిన సందర్భంలో ఈ సంఘటన జరిగింది.