: అలా చేస్తే నగరమంతా ధర్నాలు విస్తరిస్తాయి: ప‌్ర‌భుత్వానికి కోదండ‌రాం హెచ్చ‌రిక‌

ప్ర‌భుత్వం త‌మ డిమాండ్లను నెర‌వేర్చాల‌ని కోరుతూ, ధ‌ర్నా చేయాల‌నుకున్న వారికి ముందుగా గుర్తుకొచ్చేది హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్దనున్న ధర్నాచౌక్‌. అయితే, ఇక‌పై అక్క‌డ నిర‌స‌న‌లు తెల‌ప‌డానికి వీల్లేదంటూ ధర్నాచౌక్‌ మూసివేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం యోచిస్తుండ‌డంతో అందుకు నిరసనగా, ఈ రోజు అసెంబ్లీ ముందు ఉన్న‌ గన్‌పార్క్‌ వద్ద తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు మౌనదీక్ష చేబట్టారు. ఇందిరా పార్క్ నుంచి ధ‌ర్నాచౌక్‌ను తొల‌గించడం మంచిది కాద‌ని హెచ్చ‌రించారు.
 
ఈ సందర్భంగా ఈ నిర‌న‌స ప్ర‌దర్శ‌న‌లో పాల్గొన్న టీజేఏసీ ఛైర్మ‌న్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ.. ధ‌ర్నాచౌక్‌ను తొల‌గిస్తే భార‌త‌ రాజ్యాంగం ఆర్టికల్‌ 19 ద్వారా కల్పించిన హక్కుకు భంగం కలిగించిన‌ట్లేన‌ని అన్నారు. అక్క‌డ ధ‌ర్నాచౌక్‌ను తొలగిస్తే ప్ర‌జాస్వామ్యం మనుగడ కోల్పోతుందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ధర్నాచౌక్‌ పరిరక్షణ కోసం నెల రోజులుగా పలు రకాల పోరాటాలు జ‌రుపుతున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఇప్ప‌టికే ఈ అంశంపై తాము డీజీపీకి, కలెక్టర్లకు విజ్ఞప్తులు చేశామని చెప్పారు. విజ్ఞ‌ప్తులు ప‌ట్టించుకోకుండా ఒక‌వేళ ప్ర‌భుత్వం ధర్నాచౌక్‌ మూసివేస్తే నగరమంతా ధర్నాలు విస్తరిస్తాయని ఆయ‌న హెచ్చరించారు. స‌ర్కారు త‌గిన‌ నిర్ణయం తీసుకోకపోతే ఈ నెల 15న ధర్నాచౌక్‌కు పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా తరలిరావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో తెలంగాణ‌ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొని ప్ర‌భుత్వ తీరుపై మండిప‌డ్డారు.

More Telugu News