: కాల్పులు జరిపి 'బాంబ్ నాగ'ను పట్టుకున్న పోలీసులు
బెంగళూరుకు చెందిన మాజీ రౌడీ షీటర్ బాంబ్ నాగ అలియాస్ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని వేలూరు జిల్లాలో బాంబ్ నాగను గుర్తించిన కర్ణాటక పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో బెంగళూరులోని శ్రీరామపురంలో ఉన్న అతని నివాసంపై దాడులు చేయగా ఏకంగా రూ. 14.80 కోట్ల పాతనోట్లు దొరికిన సంగతి తెలిసిందే. వెంటనే అతను అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. ఆ తర్వాత ఎక్కడున్నాడో తెలియకుండా... సీఎం సిద్ధరామయ్యపై విమర్శలు చేస్తూ సీడీలు విడుదల చేశాడు. ఒకవేళ తాను చనిపోతే దానికి కారణం సిద్ధరామయ్యే అని సీడీల్లో ఆరోపించాడు. బాంబ్ నాగను పట్టుకునే క్రమంలో అతనిపై పోలీసులు కాల్పులు జరపగా... అతని కాలుకు గాయాలయినట్టు తెలుస్తోంది. అతడిని అరెస్ట్ చేసిన తర్వాత, అక్కడ నుంచి బెంగళూరుకు తీసుకొచ్చారు.