: 'ప్రేమించవు, పెళ్లి కూడా చేసుకోవా?' అంటూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై దాడి చేసిన ప్రేమోన్మాది
సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై ప్రేమోన్మాది దాడి చేసిన ఘటన హైదరాబాదులోని సింగపూర్ టౌన్ షిప్ లో చేసుకుంది. ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.... పోచారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఇన్ఫోసిస్ లో పిట్ట రోజా (23) అనే యువతి గత రెండున్నరేళ్లుగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా విధులు నిర్వర్తిస్తోంది. అదే సంస్థలో ఆమెతో పాటు చరణ్ చౌదరి అనే యువకుడు కూడా పని చేస్తున్నాడు. అతను కూడా ఆమె నివసించే సింగపూర్ టౌన్ షిప్ లో ఆమె పక్క ఫ్లాట్ లో నివాసం ఉంటున్నాడు.
గత ఆరు నెలలుగా ఆమెను ప్రేమించాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న ఆమె ఒంటరిగా ఉండడం చూసిన చరణ్ చౌదరి తనను ప్రేమించాలని అడిగాడు. దానికి ఆమె నిరాకరించడంతో సరే పెళ్లి చేసుకుందామంటూ కొత్త ప్రపోజల్ ముందుకు తెచ్చాడు. దీనికి కూడా ఆమె 'నో' చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో ఆమెపై దాడికి దిగాడు. ఆమె తలను గోడకేసి కొట్టాడు. దీంతో ఆమె తలకు తీవ్రగాయం కాగా, ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో చరణ్ చౌదరి పరారయ్యాడు. స్థానికుల సాయంతో చికిత్స తీసుకున్న ఆమె...పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు చరణ్ చౌదరి కోసం గాలింపు చేపట్టారు.