: ప్రత్యేక చెక్ పోస్టులు, సీసీ కెమెరాలు... జయలలిత విడిది కేంద్రానికి భారీ భద్రత
జయలలిత మరణం తరువాత, హత్యలు నేరాలు, దోపిడీలు జరిగాయని భావిస్తున్న కొడనాడు వేసవి విడిది కేంద్రానికి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 160 ఎకరాల విస్తీర్ణంలో, చుట్టుపక్కల ఎటువైపు నుంచైనా చేరేలా ఉండే 12 మార్గాలు, ఓ పాత, మరో కొత్త బంగ్లా, హెలిప్యాడ్ లతో అత్యంత సుందరంగా కనిపించే కొడనాడు ఎస్టేట్ కు పూర్తి స్థాయి భద్రత కల్పించారు. 20 సీసీ కెమెరాలను, అన్ని మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అమ్మ బతికున్నంత వరకూ భద్రత నడుమే ఉన్న ఎస్టేట్ కు, ఆమె కనుమూసిన తరువాత భద్రత తొలగిపోగా, అదే అదనుగా వాచ్ మెన్ ను హత్య చేసిన దుండగులు, అక్కడున్న విలువైన వస్తువులను, నగదును అపహరించుకు పోయారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ జయలలితకు సంబంధించిన మిస్టరీ దాగుందని, దాన్ని గురించి శశికళకు, ఆమె బంధువు దినకరన్ కు మాత్రమే తెలిసుండవచ్చని పోలీసు వర్గాలూ వ్యాఖ్యానించాయి.
ఈ నేపథ్యంలో కొందరు ఎస్టేట్ లోకి డ్రోన్ కెమెరాలను పంపి పరిసరాలను చూస్తున్నారని తెలియడంతో, మరేవైనా అనుమానాస్పద ఘటనలు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసు వర్గాలు అప్రమత్తం అయ్యాయి. ఇక్కడి తేయాకు తోటల నుంచి రోజుకు వెయ్యి కిలోల వరకూ తేయాకు మాయం అవుతున్న అనుమానాలూ కలగడంతో, పరిసరాలను తమ అధీనంలోకి తీసుకోవాలని భావించిన పోలీసులు చెక్ పోస్టులను సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ వైపుగా ఏ వాహనం వెళ్లినా, వారి వివరాలు, వాహనం నంబర్లు, ప్రయాణిస్తున్న వారి పేర్లను నమోదు చేస్తున్నామని నీలగిరి ఎస్పీ మురళీ రంభ పేర్కొన్నారు.