: టీమిండియా కోహ్లీపై మాత్రమే ఆధారపడలేదు... ఛాంపియన్స్ ట్రోఫీపై బెంగలేదు: కపిల్ దేవ్
టీమిండియా కేవలం కెప్టెన్ విరాట్ కోహ్లీ మీద మాత్రమే ఆధారపడలేదని మాజీ దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ తెలిపారు. టుస్సాడ్ మ్యూజియంలో పెట్టిన ఆయన మైనపు విగ్రహాన్ని వీక్షించిన అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు కపిల్ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా భారత జట్టు ఛాపింయన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్టులో సమర్థులైన ఆటగాళ్లున్నారని అన్నారు. అందుకే కోహ్లీ ఫాంపై పెద్దగా ఆందోళన లేదని ఆయన తెలిపారు.
ఆసీస్ టూర్ కు ముందు కూడా టీమిండియా ఆటగాళ్లపై ఇలాంటి ఆలోచనే ఉండేదని, అయితే ధర్మశాల టెస్టులో కోహ్లీ దారుణంగా విఫలం కాగా, ఇతర ఆటగాళ్లు జట్టు భారాన్ని తలకెత్తుకున్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కోహ్లీ పేరు చెప్పి ఇతర ఆటగాళ్ల ప్రతిభను తక్కువ చేయవద్దని ఆయన సూచించారు. టీమిండియాలో ప్రతి ఆటగాడు విలువైన ఆటగాడని, ప్రతిభ ఆధారంగానే ఇక్కడివరకు వచ్చారని ఆయన తెలిపారు. ఛాంపియన్స్ ట్రోపీలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తుందని ఆయన తెలిపారు.