: మాయావతి రూ.50 కోట్లు డిమాండ్ చేశారంటూ ఆడియో టేపులు బయటపెట్టిన సిద్ధిఖీ
బీఎస్పీ చీఫ్ మాయావతిపై ఆ పార్టీ బహిష్కృత నేత నసీముద్దీన్ సిద్ధిఖీ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె పెద్ద బ్లాక్‌మెయిలర్ అని విమర్శించిన ఆయన రూ.50 కోట్లు ఇవ్వాలని మాయావతి తనను డిమాండ్ చేశారని ఆరోపించారు. తన ఆరోపణలకు పూర్తి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. మాయావతి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మాయావతి రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్టు చెబుతున్న ఆడియో టేపును మీడియా సమావేశంలో ఆయన వినిపించారు.
ఇటువంటి టేపులు తన వద్ద ఇంకా 150 ఉన్నాయన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముస్లింలు బీఎస్పీకి ఓటు వేయనందుకు వారు నమ్మకద్రోహులని మాయావతి అభ్యంతరకరంగా మాట్లాడారన్నారు. సిద్ధిఖీ వ్యాఖ్యలపై స్పందించిన మాయావతి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణలను ఖండించారు. సిద్ధిఖీనే బ్లాక్ మెయిలింగ్ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించారని ఆమె ఆరోపించారు.