: టీడీపీకి ఉలికిపాటు ఎందుకు?... జగన్ ప్రధానిని కలిస్తే తప్పేంటి?: కావూరి సూటి ప్రశ్న
దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత.... అధికార పార్టీ చేతిలో కేవలం రెండు శాతం ఓట్లతో ఓటమిపాలైన వైఎస్సార్సీపీ అధినేత కలవడంలో వింత ఏమిటో తనకు అర్ధం కావడం లేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కావూరి సాంబశివరావు ప్రశ్నించారు. టీడీపీ నేతలు దీనిని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో తనకు తెలియడం లేదని ఆయన చెప్పారు. భారతదేశంలోని ఏ పౌరుడైనా ప్రధాని అపాయింట్ మెంట్ ఇస్తే కలవవచ్చని ఆయన అన్నారు.
అలాంటిది ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత ప్రధానిని కలవడంలో వింత ఏముందని ఆయన అడిగారు. జగన్ ప్రధాని కాళ్ల మీద పడడం ఏ టీడీపీ నేత చూశారో తనకు తెలియదని ఆయన చెప్పారు. లోపల వారేం మాట్లాడుకున్నారో కూడా తనకు తెలియదని, మీడియా రేపు రాస్తే... తాను చదివి తెలుసుకుంటానని ఆయన తెలిపారు. ఇలాంటి సంఘటనపై చర్చించడం అనవసరమని ఆయన చెప్పారు. ఏదీ లేని దానికి ఏదో ఉందని ప్రచారం చేయడం తనకు ఇష్టం ఉండదని ఆయన తెలిపారు.