: పాన్ కార్డుతో ‘ఆధార్’ అనుసంధానికి కొత్త లింక్ ప్రారంభం
పాన్ కార్డుతో ‘ఆధార్’ అనుసంధానాన్ని మరింత సులభతరం చేసేందుకు ఆదాయ పన్ను శాఖ కొత్త లింక్ ను ప్రారంభించింది. సంస్థ వెబ్ సైట్ లో https://incometaxindiaefiling.gov.in/e-Filing/UserLogin/LoginHome.html’ పేరుతో కొత్త లింక్ ను ప్రారంభించినట్టు ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు పాన్ నెంబరు తప్పనిసరి చేసిన నేపథ్యంలోనే ఈ కొత్త లింక్ ను ప్రారంభించినట్టు తెలిపారు. ఒక వ్యక్తి యొక్క పాన్, ఆధార్ కార్డులను అనుసంధానించడానికే దీనిని హోం పేజీలో సృష్టించామని, ఈ రెండు కార్డుల్లో నమోదు చేసిన వివరాలు ఒకేలా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.
యుఐడీఏఐ నుంచి వెరిఫికేషన్ తర్వాత, ఈ లింక్ ధ్రువీకరిస్తుందని, ఐటీ ఈ ఫైలింగ్ వెబ్ సైట్ లో లాగిన్ అవసరం లేకుండానే ఎవరైనా ఈ లింక్ ద్వారా ఆధార్, పాన్ నంబర్లను అనుసంధానించుకోవచ్చని పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం, రిజిస్టర్డ్ మొబైల్ కు వన్ టైమ్ పాస్ వర్డ్ లేదా ఈ-మెయిల్ పంపుతామని ఆదాయనపన్ను శాఖ అధికారులు పేర్కొన్నారు.