: ఆరుసార్లు గుండెపోటు వచ్చినా బతికి బయటపడ్డ ‘మిరాకిల్ బేబీ’!

గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నాలుగు నెలల పాపకు వైద్యులు పన్నెండు గంటల పాటు సంక్లిష్టమైన శస్త్ర చికిత్స నిర్వహించారు. ఇంతకన్నా, ఆశ్చర్యపరిచే మరో విషయమేమిటంటే, శస్త్రచికిత్స అనంతరం, ఆ పాపకు ఆరుసార్లు గుండెపోటు రావడం! అయినా... బతికి బయటపడ్డ ఆ ‘మిరాకిల్ బేబీ’ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మహారాష్ట్రలోని థానే జిల్లా, కల్యాణ్ సిటీకి చెందిన దంపతులు విశాక, వినోద్ వాగ్ మరె కూతురు విదిశ. ఆ చిన్నారికి నలభై ఐదు రోజుల వయసు ఉన్నప్పుడు తల్లి పాలిస్తుండగా ఒక్కసారిగా స్పృహ కోల్పోయింది. దీంతో, దగ్గరలోని నర్సింగ్ హోమ్ కు వెళితే, బీజే వాడియా ఆసుపత్రికి తీసుకువెళ్లమని సూచించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి, అరుదైన గుండె సంబంధిత వ్యాధితో విదిశ బాధపడుతున్నట్లు చెప్పారు.

సాధారణంగా ఉండే గుండె తీరుకు భిన్నంగా ఆ పాప గుండె ఉందని, పని తీరు పూర్తిగా విరుద్ధంగా ఉందని గుర్తించారు. సర్జరీ ద్వారా సమస్యను అధిగమించవచ్చని చెప్పారు. డాక్టర్ బిశ్వా పాండా ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చి 14న విదిశకు ఆపరేషన్ చేశారు. సుమారు పన్నెండు గంటల పాటు ఆపరేషన్ నిర్వహించారు. గుండె పనితీరు మెరుగైనా మరో కొత్త సమస్య తలెత్తింది. గుండె సాధారణ పనితీరుకు చిన్నారి ఊపిరితిత్తులు అలవాటు పడలేకపోయాయి.

దీంతో, రక్తంలో ఆక్సిజన్ స్థాయి హఠాత్తుగా పడిపోవడంతో కార్బన్ డై ఆక్సైడ్ మూడు రెట్లు పెరిగిపోవడంతో ఆరుసార్లు గుండెపోటుకు గురైంది. సుమారు యాభై ఒక్క రోజుల పాటు ఆ చిన్నారిని ఐసీయూలో ఉంచి, హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్ సాయంతో విదిశకు చికిత్స అందించారు. ఆ తర్వాత  రెండు నెలలకు కోలుకున్న విదిశ ఇప్పుడు బాగానే ఉంది. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, ఇలాంటి కేసుల్లో పుట్టగానే గుండెకు సర్జరీ చేయాలని, అలా చేయకపోవడం వల్ల ఊపిరితిత్తులు ఇబ్బంది పెట్టాయని అన్నారు.

More Telugu News