: గోరఖ్ పూర్ అల్లర్ల కేసులో సీఎంపై విచారణకు అంగీకరించం!: యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
సుమారు పదేళ్ల క్రితం నాటి గోరఖ్ పూర్ అల్లర్ల కేసులో సీఎం యోగి ఆదిత్యానాథ్ ను విచారించేందుకు అంగీకరించలేమని అలహాబాద్ హైకోర్టుకు యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాహుల్ భట్నాగర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ఫోరెన్సిక్ విచారణ కోసం పంపిన ఆడియో క్లిప్స్ ను గతంలో మార్చినట్టు తెలియడంతోనే భట్నాగర్ ఈ నిర్ణయం తీసకున్నట్టు సమాచారం.
కాగా, ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసు తదుపరి విచారణ జులై 7వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలాఉండగా, 2007లో యోగి రెచ్చగొట్టే ప్రసంగం చేయడం కారణంగానే గోరఖ్ పూర్ అల్లర్లు జరిగాయని ప్రతివాది ఆరోపణలు. ఈ కేసు విషయంలో యోగి గతంలో జైలుకు వెళ్లారు. ఆ తర్వాత ఈ కేసు విచారణ యూపీ సీఐడీ చేతుల్లోకి వెళ్లింది. 2015లో యోగిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీఐడీ కోరినా, అప్పటి ప్రభుత్వం అందుకు అనుమతివ్వలేదు.