: చంద్రబాబు సూచించిన అభ్యర్థిని బీజేపీ ఒప్పుకున్నట్టు లేదు: రోజా
ప్రధాని మోదీని తమ అధినేత జగన్ కలవగానే టీడీపీ నేతలు కంగారుపడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. మోదీపై టీడీపీ నేతలకు నమ్మకం లేదనే విషయం దీంతో అర్థమవుతోందని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తామని జగన్ చెప్పగానే టీడీపీ నేతలకు ఎందుకంత ఉలికిపాటు అని ప్రశ్నించారు. తనకు ఒకటే అర్థమవుతోందని... రాష్ట్రపతి అభ్యర్థిగా చంద్రబాబు ఎవరినో సూచించారని... అయితే, దీనికి బీజేపీ ఒప్పుకోకపోయి ఉండవచ్చని అన్నారు.
రాష్ట్రపతి ఎన్నిక చాలా గౌరవప్రదమైనదని... రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే బాగుంటుందనే ఆలోచనతో జగన్ అలా చెప్పారని రోజా తెలిపారు. సొంత జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వలేని మంత్రి దేవినేని ఉమా కూడా జగన్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో ప్రజలంతా కష్టాలు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర సమస్యలు, ఎమ్మెల్యేల ఫిరాయింపులు, అగ్రిగోల్డ్ వ్యవహారం గురించే ప్రధానిని జగన్ కలిశారని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి కేవలం జగన్ మాత్రమే మాట్లాడుతున్నారని తెలిపారు.