: నా కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడన్న విషయం నాకు తెలియదు: మంత్రి నారాయణ
కడుపులో పెట్టుకుని పెంచుకున్న కుమారుడు చేతికి అందివచ్చిన సమయంలో దుర్మరణం పాలవడం మంత్రి నారాయణను అంతులేని విషాదాన్ని మిగిల్చింది. నిషిత్ ఇక లేడు అన్న వార్తతో ఆయన కుప్పకూలిపోయారు. లండన్ నుంచి ఇండియాకు వచ్చి కుమారుడి మృతదేహాన్ని చూసిన నారాయణ శోకసంద్రంలో మునిగిపోయారు. కన్నీరుమున్నీరయ్యారు.
నిషిత్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడన్న విషయం తనకు తెలియదని... తెలిస్తే వారించేవాడినని కన్నీటితో అన్నారు. తనతో పాటు కలసి ప్రయాణించేటప్పుడు సాధారణ వేగంతోనే వెళ్లేవాడని... అందుకే ఈ విషయంలో నిషిత్ పై తనకెప్పుడూ అనుమానం రాలేదని అన్నారు. కుమారుడి మృతదేహం వద్ద విలపిస్తున్న నారాయణను ఆపడం ఎవరి తరం కాలేదు. మరోవైపు, నిషిత్ అంత్యక్రియలు కాసేపటి క్రితం ముగిశాయి.