: ఆర్థిక ఉగ్రవాదికి మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వడం బాధాకరం: టీడీపీ నేత రాజేంద్రప్రసాద్
ఈడీ, సీబీఐ కోర్టుల్లో 12 ఛార్జ్ షీట్లు నమోదైన ఆర్థిక ఉగ్రవాది జగన్ కు ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వడం చాలా దురదృష్ణకరమని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుల వల్లే ప్రధాని మోదీని జగన్ కలిశారని ఆరోపించారు. ఆదాయానికి మించిన ఆస్తులు, అవినీతి కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో త్వరగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన మరుసటి రోజే... ఢిల్లీకి వెళ్లి ప్రధానిని శరణు కోరాడంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు.
గతంలో జగన్ తల్లి విజయమ్మ కూడా రాష్ట్రపతి ప్రణబ్ ను ఈ కేసుల విషయమై కలిశారని... బయటకు వచ్చిన తర్వాత రైతు సమస్యలపై కలిశానని చెప్పారని ఎద్దేవా చేశారు. వాళ్ల అమ్మ మాదిరిగానే జగన్ కూడా మిర్చి రైతులు, అగ్రిగోల్ బాధితులు, ప్రత్యేక హోదా సమస్యల గురించి ప్రధానికి చెప్పానంటూ బయటకు వచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనపై మాట్లాడే నైతికత కూడా జగన్ కు లేదని రాజేంద్రప్రసాద్ అన్నారు. ఎండల వేడి నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు అమెరికా వెళ్లారంటూ జగన్ మాట్లాడటం అతని బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తోందని చెప్పారు.