: ఇండియా టూ లిబియా వయా శ్రీలంక, దుబాయ్! ఐఎస్ఐఎస్ కు ఔషధాలు!
ఇండియాలో తయారై లిబియాలోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు వెళుతు 37.5 మిలియన్ల 'ట్రమడోల్' మాత్రలను ఇటలీ పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు తమకు తగిలిన గాయాల వల్ల కలిగే నొప్పిని తట్టుకునేందుకు ఈ మాత్రలను విరివిగా వాడుతుంటారని బ్రిటన్ దినపత్రిక ఒకటి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇక ఈ మాత్రలు ఏ డ్రగ్ కంపెనీలో తయారయ్యాయి? వీటిని ఎవరు బట్వాడా చేస్తున్నారన్న విషయమై ఇటలీ పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఇండియాలో తయారైన వీటిని ఓ దుబాయ్ దిగుమతిదారు ఆర్డర్ చేసుకుని, శ్రీలంక మీదుగా తెప్పించుకున్నారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వీటిని లిబియాలో ఒక్కోటి రెండు డాలర్లకు విక్రయిస్తుంటారని విచారణాధికారి ఒకరు తెలిపారు. కాగా, నైజీరియా ఉగ్రవాద సంస్థ బోకో హరామ్ కూడా ఈ మాత్రలను అధికంగా వాడుతోంది. తమ వద్ద ఉన్న చిన్న పిల్లలకు ఆయుధాలు ఇచ్చి యుద్ధానికి పంపుతున్న బోకో హరామ్, వారికి ఈ మాత్రలను కూడా అందిస్తోంది. వీటితో పాటు ఆకలిని చంపే కాప్టాగాన్, ఆంఫిటామైన్ ఔషధాలను కూడా ఉగ్రవాద సంస్థలు వాడుతున్నాయి.