: అమాయకమైన ట్వీట్ కు 34,30,500 రీట్వీట్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన యువకుడు


కొన్నిసార్లు మనం చేసే పనులు ఊహించని అద్భుతాలు చేస్తుంటాయి. ట్విట్టర్ లో ఆ యువకుడు పెట్టిన అమాయకమైన ట్వీట్ 34,30,500 సార్లు రీట్వీట్ అయి అతనికి కావాల్సింది ఇవ్వకపోయినా...ప్రపంచ రికార్డును మాత్రం కట్టబెట్టింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని వాషింగ్టన్ కు చెందిన కార్టర్‌ విల్కర్సన్‌ (16) కు చికెన్ నగెట్స్ అంటే చాలా ఇష్టం. దీంతో ఓ ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌ కు వెళ్లి చికెన్‌ నగెట్స్‌ కు ఆర్డరిచ్చాడు. అవి అతనికి చాలా బాగా నచ్చాయి. దీంతో ఆవురావురుమంటూ ఆరగించిన విల్కర్సన్... అక్కడ ఒక సెల్పీ దిగి...దానిని ట్విట్టర్ లో పోస్టు చేస్తూ, ‘‘ఏడాది పొడుగునా ... ఈ రెస్టారెంట్లో ఫ్రీగా చికెన్‌ నగెట్స్‌ తినాలంటే నా ఈ పోస్టుకు ఎన్ని రీట్వీట్లు అవసరం?’’ అంటూ ప్రశ్నించాడు.

దీనికి ఆ యాజమాన్యం సరదాగా స్పందిస్తూ, ‘‘ఎంతలేదన్నా.. 1.8 కోట్ల రీట్వీట్లు కావాల్రా అబ్బాయ్‌’’ సమాధానం ఇచ్చింది. అంతే, ఆ ట్వీట్ రీట్వీట్ అవ్వడం ప్రారంభించింది. ఇలా ఆ ట్వీట్ రీట్వీట్ అవుతూ సుమారు 34,30,500 సార్లు రీ ట్వీట్ అయింది. దీంతో ఇది అత్యధిక రీట్వీట్లు సాధించిన ట్వీట్ గా ప్రపంచ రికార్డు ఇచ్చారు. గిన్నిస్ బుక్ లో స్ధానం సంపాదించిన తన ట్వీట్ పై విల్కర్సన్ హర్షం వ్యక్తం చేశాడు. అయితే ఈ ట్వీట్ అతనికి ఇష్టమైన చికెన్ నగెట్స్ రోజూ తినే అవకాశానికి అర్హత తేనప్పటికీ... ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో ఆ సంస్థ ఏడాది పాటు రోజూ చికెన్ నగెట్స్ తినే అవకాశం కల్పిస్తున్నామని ప్రకటించింది.

  • Loading...

More Telugu News