: డొనాల్డ్ ట్రంప్! చాలా పెద్ద తప్పు చేశారు: డెమొక్రాట్ చుక్ స్కూమెర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా పెద్ద తప్పు చేశారంటూ ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీ మండిపడింది. ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై పెదవి విప్పని డెమొక్రాట్లు మాత్రం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్ జేమ్స్ కోమియోను డిస్మిస్ చేయడంపై మండిపడ్డారు. ఈ మేరకు ఆ పార్టీ నేత చుక్ స్కూమెర్ మాట్లాడుతూ, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెద్ద తప్పు చేశారని అన్నారు. రష్యా సంబంధాల విషయంలో విచారణ పూర్తయితే తన తప్పులు బయటపడతాయనే భయంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. ఈ చర్యతో రష్యాతో కలిసి ట్రంప్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న అనుమానం మరింత బలపడిందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి అమెరికన్ అనుమానం వ్యక్తం చేసేలా తీవ్రమైన తప్పు ట్రంప్ చేశారని ఆయన చెప్పారు.