: ఈ ఏడాదికి వదిలేయండి.. వచ్చే ఏడాది బాగా ఆడతాం!: క్రిస్ గేల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు క్రిస్ గేల్ క్షమాపణలు చెప్పాడు. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ బ్యాట్స్ మన్ డివిలియర్స్ అభిమానులకు క్షమాపణలు చెప్పగా, తాజాగా గేల్ అభిమానులకు క్షమాపణలు చెప్పడం విశేషం. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా 'మా జట్టు (ఆర్‌సీబీ) ప్రదర్శనతో పాటు నా ఆటతీరుపై సంతోషంగా ఉండలేను. ఇది చాలా నిరాశకు గురిచేస్తోంది. అభిమానులకు క్షమాపణలు. మేమంతా చింతిస్తున్నాం. వరుసగా విఫలమవుతున్నప్పటికీ అభిమానులు స్టేడియానికి వచ్చి మద్దతు తెలపడం అమోఘమైనది. వచ్చే ఏడాది మంచి ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నా’నంటూ గేల్ ట్వీట్ చేశాడు. కాగా, ఐపీఎల్ పదో సీజన్ లో ఘోరంగా విఫలమైన ఆర్సీబీ కేవలం రెండు మ్యాచ్ లలోనే విజయం సాధించి, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్ధానాన్ని అలంకరించింది.