: అమెరికాకు అంత సీన్ లేదు....మొదట దాడి చేసేది మేమే!: ఉత్తరకొరియా రాయబారి సంచలన వ్యాఖ్యలు
తమ దేశంపై అమెరికా ముందు దాడి చేయలేదని తమకు తెలుసని, తాము మాత్రం అలా కాదని, ఏ క్షణంలో అయినా అమెరికాలోని ప్రధాన భాగాలను బూడిద చేసేస్తామని యూకేలోని ఉత్తరకొరియా రాయబారి సంచలన ప్రకటన చేశారు. అమెరికాతో ఉత్తరకొరియాకు నెలకొన్న వివాదంపై ఆయన మాట్లాడుతూ, కొరియా జలాల్లోకి ప్రవేశించిన అమెరికా బలగాలు ఒక్క అంగుళం ముందుకు కదిలినా తమ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చూస్తూ ఊరుకోరని అన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని చెప్పిన ఆయన, అమెరికా ఏమాత్రం హద్దుమీరినా...ఆ దేశంలోని ప్రధాన భాగాలను తమ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ బూడిద కుప్పగా మారుస్తారని అన్నారు.
అయితే అందుకు తేదీ, సమయం గురించి తామెవరికీ కచ్చితంగా తెలియదని ఆయన చెప్పారు. త్వరలోనే ఆరో అణు పరీక్ష నిర్వహించడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. తాము ఎవరికీ భయపడబోమని, భయపడాల్సిన అవసరంలేదని ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు. అంతే కాదని, అమెరికా మొదటగా దాడి చేయలేదని తమకు తెలుసునని, మొదట దాడి చేయబోయేది తమ అధ్యక్షుడేనని ఆయన ప్రకటించారు. తాజాగా, దక్షిణకొరియా అధ్యక్షుడిగా ఎన్నికైన మూన్ అమెరికా, ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్త పరిస్థితులను పరిష్కరిస్తానని, కిమ్‌ను త్వరలోనే కలుస్తానని ప్రకటన చేసిన అనంతరం యూకేలోని ఉత్తరకొరియా రాయబారి చేసిన వ్యాఖ్యలు ప్రమాదతీవ్రతను చాటి చెబుతున్నాయి.