: ముంబైని హోరెత్తించిన బీబర్.. పోటెత్తిన అభిమానులు
పాప్ సంచలనం జస్టిన్ బీబర్ షోతో ముంబై హోరెత్తింది. అభిమానుల కేరింతలతో ఉర్రూతలూగింది. భారత్‌లో తొలిసారి పర్యటించిన బీబర్ తన షోతో ముంబై వాసులను మంత్రముగ్ధులను చేశాడు. భారత్‌లో తొలిసారిగా ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నిర్వహించిన షోకు 45 వేల మందికిపైగా హాజరయ్యారు. అంతకుముందు సిబ్బందితో కలిసి ప్రత్యేక విమానంలో ముంబైలోని కలీనా విమానాశ్రయానికి చేరుకున్న బీబర్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
రాత్రి నిర్వహించిన షోకు బాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీదేవి, బోనీకపూర్ దంపతులతోపాటు సోనాలీ బెంద్రే, అనుమాలిక్, అర్జున్ రాంపాల్, అర్మాన్ మాలిక్, అర్భాజ్ ఖాన్, అలియా భట్, మలైకా అరోరా తదితరులు వచ్చారు. బీబర్ బృందంలో హ్యారీపోటర్ నటి ఎలారికా జాన్సన్, డీజే సార్టెక్, జీడెన్, అలెన్ వాకర్ తదితరులున్నారు. 500 మంది పోలీసులతో షోకు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ హేమంత నగ్రాలె తెలిపారు. ఢిల్లీ, జైపూర్, ఆగ్రాలోనూ బీబర్ పర్యటించనున్నట్టు సమాచారం.