: ఉమర్ ఫయ్యజ్ హత్య ఓ పిరికిపంద చర్య: అరుణ్ జైట్లీ
రాజపుత్ రైఫిల్స్ కు చెందిన యువ ఆర్మీ అధికారి ఉమర్ ఫయ్యజ్ హత్యను కేంద్ర రక్షణమంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా ఖండించారు. ఉమర్ హత్యను ఓ పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. కాశ్మీర్ యువతకు ఆయన ఒక రోల్ మోడల్ గా నిలిచారని అన్నారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఆయన పాటుపడ్డారన్నారు. ఈ సందర్భంగా ఉమర్ కుటుంబసభ్యులకు తన సంఘీభావం తెలియజేశారు.
కాగా, కుల్గాంలో జరిగిన తన కజిన్ వివాహానికి హాజరైన ఉమర్ ను ఉగ్రవాదులు అపహరించి, దారుణంగా హత్య చేశారు. ఈ రోజు ఉదయం షోపియన్ ప్రాంతానికి ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉమర్ మృతదేహం పడి ఉండటాన్ని గ్రామస్తులు గుర్తించారు. ఉమర్ తల, పొత్తికడుపులో బుల్లెట్లు ఉన్నాయి. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఉమర్ మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యులకు అందజేస్తామని ఆర్మీ అధికారులు తెలిపారు. ఉమర్ ఫయ్యజ్ గత డిసెంబర్ 10వ తేదీన రాజపుత్ రైఫిల్స్ లో ఆర్మీ అధికారిగా బాధ్యతలు చేపట్టారు.