: కాసేపట్లో మోదీతో భేటీ కానున్న జగన్!
వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ వెళ్లారు. కాసేపటి క్రితమే ఆయన ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన కొన్ని అంశాలపై మోదీతో ఆయన చర్చించనున్నారు. ముఖ్యంగా మిర్చి రైతుల సమస్యలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి అంశాలను మోదీ దృష్టికి తీసుకురానున్నారు. దీనికితోడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఏపీ కేబినెట్లోకి తీసుకోవడంపై ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. విభజన సమస్యల గురించి కూడా మోదీకి జగన్ వివరించే అవకాశం ఉంది.
ప్రధాని మోదీని కలిసేందుకు గత కొంత కాలంగా జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల సందర్భంగా కూడా ప్రధానిని కలిసేందుకు జగన్ అపాయింట్ మెంట్ కోరారు. అయితే, పార్లమెంటులో అనేక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉండటంతో... జగన్ కు మోదీ అపాయింట్ మెంట్ లభించలేదు. ఇప్పుడు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడంతో జగన్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు.