: ఏమీ అనుకోకండేం...మీ ఇంట్లో దొంగిలించిన సొత్తు ఇచ్చేస్తాను!: బాధితురాలికి లేఖ రాసిన దొంగ
మీ ఇంట్లో దొంగిలించిన సొత్తు మీకిచ్చేస్తానంటూ దొంగ బాధితురాలికి లేఖ రాసిన ఆసక్తికర ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... భోపాల్ లోని టీటీ నగర్ లో నివాసముండే షాకిరాఖాన్ ఇంట్లో జనవరి 29న దొంగతనం జరిగింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్న పోలీసులు, ఐదు నెలలు గడిచినా ఎలాంటి పురోగతి సాధించలేదు. ఈ నేపథ్యంలో బాధితురాలు షాకిరా ఖాన్ కు దొంగ నుంచి నిన్న ఒక లేఖ వచ్చింది. అందులో దొంగతనం చేసినందుకు క్షమాపణలు చెప్పాడు. అంతే కాకుండా చోరీ చేసిన సొత్తును త్వరలోనే అందజేస్తానని తెలిపాడు.
బాధితురాలైన షాకిరాఖాన్ మంచి వ్యక్తి అని, కాని తాను ఆర్థిక సంక్షోభంలో ఉన్నందువల్లే దొంగతనానికి పాల్పడాల్సి వచ్చిందని తెలిపాడు. త్వరలోనే ఆమెకు ఆ సొత్తు అందజేస్తానని తెలిపిన దొంగ... ఆమె ఇంట్లో చోరీ చేసిన రెండు గిల్టు నగలను కూడా ఆమెకు పంపించేశాడు. దీంతో ఈ దొంగతనంలో పొరుగింటి వారి హస్తం ఉండే అవకాశముందని టీటీ నగర్ పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనం చేసింది ఓ మైనర్ యువకుడని అనుమానిస్తున్నామని, అయితే సరైన ఆధారాలు లేనిదే నిందితుడిని అరెస్టు చేయలేమని వారు స్పష్టం చేశారు. కాగా, సాక్షత్తూ దొంగే బాధితురాలికి లేఖ రాయడం మొట్టమొదటిసారని వారు వెల్లడించారు.