: హైదరాబాదును ముంచెత్తిన భారీ వర్షం... తెలుగు రాష్ట్రాల్లో చల్లబడ్డ వాతావరణం... నేడు ఎండలే!


హైదరాబాదు నగరాన్ని అకాల భారీ వర్షం ముంచెత్తింది. రాత్రి 11 గంటల సమయంలో ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి దాటే వరకు కొనసాగగా, వివిధ ప్రాంతాల్లో కనిష్ట వర్షపాతం 5.7 సెంటీమీటర్లు నమోదు కాగా, గరిష్టంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండుటెండల్లో ఈ స్థాయి వర్షం రావడంతో నగరవాసులు ఉపశమనం పొందారు. ఖైరతాబాద్‌, హిమాయత్‌ నగర్‌, నాగోలు, పంజాగుట్ట, మియాపూర్‌, మొయినాబాద్‌, కాప్రా, అల్వాల్‌, రామాంతపూర్‌, దిల్‌ సుఖ్‌ నగర్‌, బోయినపల్లి, అమీర్‌ పేట, పంజాగుట్ట, కూకట్ పల్లి, బీకే గుడ, సనత్ నగర్, ఎర్రమంజిల్‌, తాజ్‌ కృష్ణ, రాజేంద్రనగర్‌, గచ్చిబౌలి, మేడ్చల్‌ జిల్లాలోని కీసర, నాగారం, దమ్మాయిగూడ, కుషాయిగూడ, ఈసీఐఎల్‌, కాప్రా, ఏఎస్‌ రావు నగర్‌, నేరేడ్‌ మెట్‌.. ఇలా నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో... లోతట్టు ప్రాంతాలు జలయమయ్యాయి.

భారీ గాలితో కూడిన ఈ వర్షం ధాటికి సుమారు 30 చెట్లు కుప్పకూలాయి. పలు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో హైదరాబాదులో అంధకారం అలముకుంది. దీంతో ప్రధాన కూడళ్లలో అర్ధరాత్రి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన నగరవాసికి ఉపశమనం కల్పించింది. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో చెదురుమదురు జల్లులు కురిశాయని తెలుస్తోంది. అయితే నేడు వడగాడ్పులు భారీ స్థాయిలో వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News