: కేజ్రీవాల్ రాజీనామా కోసం అవసరమైతే ధర్నా చేస్తా: అన్నాహజారే
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువైతే ఆయన్ని పదవి నుంచి తొలగించాలని లేదా తన పదవికి రాజీనామా చేయాలని తాను డిమాండ్ చేస్తానని సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే అన్నారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా రాలెగావ్ సిద్దిలోని తన నివాసంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేజ్రీవాల్ పై వచ్చిన ఆరోపణలు రుజువైతే కనుక ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తానని చెప్పారు.
ఈ సందర్భంగా ఆప్ నేత కపిల్ మిశ్రాపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. కపిల్ మిశ్రా తన మంత్రి పదవి పోయిన తర్వాత కేజ్రీవాల్ పై ఆరోపణలు చేశారని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడే డబ్బులు చేతులు మారి ఉంటే అప్పుడెందుకు అధికారులను అప్రమత్తం చేయలేదని హజారే ప్రశ్నించారు.