: శేఖర్ కపూర్ కంటే నాకే ఎక్కువ తెలుసు: రామ్ గోపాల్ వర్మ
ప్రపంచ ప్రఖ్యాత నటుడు, మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం బ్రూస్ లీ జీవిత కథ ఆధారంగా ఒకేసారి రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. 'లిటిల్ డ్రాగన్' పేరుతో బ్రూస్ లీ కథను తెరకెక్కించనున్నట్టు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో, తాను కూడా బ్రూస్ లీపై సినిమాను తీస్తున్నట్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. బ్రూస్ లీ సినిమాకు తాను మాత్రమే న్యాయం చేయగలని వర్మ అన్నాడు.
బ్రూస్ లీ గురించి ఆయన భార్య లిండాలీ, కుమార్తె షనన్ లీ, దర్శకుడు శేఖర్ కపూర్ కంటే తనకే ఎక్కువ తెలుసని చెప్పాడు. బ్రూస్ లీని తాను దేవుడిలా ఆరాధించానని... అందుకే ఆయన సినిమా తీస్తానని స్పష్టం చేశాడు. అంతేకాదు, శేఖర్ కపూర్ సినిమా విడుదల చేసే రోజునే తన సినిమాను కూడా రిలీజ్ చేస్తానని చెప్పాడు.