: తొలి రెండు గంటలు ఓట్లు సరిగ్గానే పడతాయి.. ఆ తర్వాతే సినిమా మొదలవుతుంది!: ఆప్ ఎమ్మెల్యే భరద్వాజ్
ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి ఢిల్లీ అసెంబ్లీలో వాడివేడీ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఈవీఎంల ట్యాంపరింగ్ పై డెమో ఇస్తున్నారు. ఈ సందర్భంగా భరద్వాజ్ మాట్లాడుతూ ఎవరికి ఓటు వేసినా బీజేపీకే పడేలా సీక్రెట్ కోడ్ మార్చారని ఆరోపించారు. పోలింగ్ ప్రారంభమైన తర్వాత తొలి రెండు గంటలసేపు ఓట్లు సరిగ్గానే పడతాయని... ఆ తర్వాత బీజేపీకే పడేవిధంగా ఈవీఎంలను గోల్ మాల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా వాటర్ ట్యాంకర్ల స్కామ్ పై చర్చకోసం విపక్షాలు పట్టుబట్టాయి. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాను సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో సభ బయట బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.