: కాగ్నిజంట్ లో ఉద్యోగులకు అన్యాయంపై కదిలిన ఐటీ సంఘాలు
సుమారు 2.6 లక్షల మంది ఉద్యోగులున్న ఐటీ సేవల సంస్థ కాగ్నిజంట్ లో 5 శాతం మంది ఉద్యోగులను తొలగించడంపై ఐటీ సంఘాలు భగ్గుమన్నాయి. ఉద్యోగులను అన్యాయంగా రోడ్డున పడేశారని ఆరోపిస్తూ, తమిళనాడు లేబర్ డిపార్టుమెంట్ లో ఐటీ ఉద్యోగ సంఘాలు 'ఫోరమ్ ఆఫ్ ఐటీ ఎంప్లాయిస్ (ఎఫ్ఐటీఈ', 'ఎన్డీఎల్ఎఫ్ ఐటీ ఎంప్లాయిస్'లు పిటిషన్ దాఖలు చేశాయి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను పనితీరు అసంతృప్తికరమన్న కారణాలతో తొలగించారని, వీరి ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
కాగా, ఉద్యోగుల తీసివేతపై కాగ్నిజంట్ ప్రతినిధి స్పందిస్తూ, తమ క్లయింట్లకు అవసరమైన పూర్తి స్థాయి సేవలు, వ్యాపార లక్ష్యాలను అందుకోవడంలో భాగంగా ప్రతి సంవత్సరమూ ఉద్యోగుల పనితీరును సమీక్షిస్తుంటామని, అందులో భాగంగానే లక్ష్యాలను చేరుకోలేని వారిని తొలగించడం వంటి మార్పులు తప్పనిసరని అన్నారు. అన్ని ఐటీ కంపెనీల్లో ఇది సర్వ సాధారణమేనని అన్నారు.