: జస్టిస్ కర్ణన్ కు ఆర్నెల్ల జైలు శిక్ష విధించిన సుప్రీంకోర్టు!


కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ కు సుప్రీంకోర్టు 6 నెలల జైలు శిక్షను విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో కర్ణన్ ను దోషిగా తేల్చింది సుప్రీంకోర్టు. ఈ తీర్పు వెంటనే అమల్లోకి వస్తుందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. వివరాల్లోకి వెళ్తే, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ కు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్షను నిన్న కర్ణన్ విధించారు. ఆయనతో పాటు సుప్రీంకోర్టులోని మరో ఆరుగురు న్యాయమూర్తులకు అదే శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున జరిమానా విధించారు. వారం రోజుల్లోగా ఢిల్లీలోని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కాన్స్టిట్యూషనల్ బాడీకి ఈ జరిమానాను చెల్లించాలని... లేకపోతే మరో ఆరు నెలలు అదనంగా జైల్లో ఉంటారని జస్టిస్ కర్నన్ తన తీర్పులో తెలిపారు. ఈ నేపథ్యంలో, ఆయనకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది.

జస్టిస్ కర్ణన్ మానసిక స్థితి సరిగా లేదంటూ సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించింది. అంతేకాదు, ఆయనకు వైద్య చికిత్స అందించాలంటూ ఆదేశించింది. అయితే, తన మానసిక స్థితి చాలా బాగుందని... తనకు ఎలాంటి వైద్యం అవసరం లేదంటూ జస్టిస్ కర్నన్ తన వద్దకు వచ్చిన వైద్య బృందాన్ని వెనక్కి తిప్పి పంపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News