: భారత్ ను మచ్చిక చేసుకునేందుకు పాట్లు పడుతున్న చైనా... రహస్యంగా ఉంచాల్సిన సమాచారం బట్టబయలు!
సుమారు రూ. 2.50 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చైనా తలపెట్టిన భారీ ప్రాజెక్టు సీపీఈసీ (చైనా - పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్)పై భారత విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్న చైనా, మచ్చిక చేసుకునేందుకు పాట్లు పడుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం నుంచి ఈ ప్రాజెక్టు వెళుతున్నందున భారత్ సహకారం లేకుంటే విజయవంతం కాలేమని చైనా అనుకుంటోంది. ఈ ప్రాజెక్టుకు భారత్ ను ఒప్పించేందుకు రంగంలోకి దిగిన చైనా దౌత్యవేత్తలు, ప్రాజెక్టు పేరును మారుస్తామని వెల్లడించారు. వచ్చే వారంలో ఓబీఓఆర్ (వన్ బెల్త్ వన్ రోడ్) సదస్సు జరగనున్న నేపథ్యంలో, చైనా అధికారులు, భారత అధికారుల మధ్య రహస్యంగా చర్చలు జరుగగా, వాటి వివరాలను చైనీస్ ఎంబసీ వెబ్ సైట్ లో ఉంచడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సీపీఈసీకి ఇండియా సహకరించేలా ప్రాజెక్టు పేరును మారుస్తామని చెప్పింది. శుక్రవారం నాడు దౌత్యాధికారి లువో జవోహుయ్ నేతృత్వంలోని అధికారుల బృందం భారత అధికారులతో సమావేశం కాగా, ఈ వివరాలు సోమవారం సాయంత్రానికి ఎంబసీ వెబ్ సైట్లోకి వచ్చాయి. ఆపై విషయం తెలుసుకుని అధికారులు ఆ ఫైల్ ను తొలగించినప్పటికీ, గూగుల్ క్యాచ్డ్ పేజీల్లో ఆ సమాచారం ఇంకా కనిపిస్తూనే ఉంది. భారత సార్వభౌమత్వానికి ఎంతమాత్రమూ సమస్య రాబోదని, ఈ ప్రాజెక్టు పేరును మార్చేందుకు తాము ఆలోచిస్తున్నామని, ద్వైపాక్షిక చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని ఆలోచించే రెండు స్నేహ దేశాల మధ్య వివాదాలు ఉండరాదన్నదే తమ అభిమతమని అధికారులు చెప్పినట్టు ఈ పత్రాల్లో ఉంది. ఇండియాతో స్నేహాన్ని మాత్రమే తాము కోరుతున్నామని అదే రెండు దేశాలకూ మంచిదని అధికారులు స్పష్టం చేసినట్టు ఉంది.