: బద్ధ శత్రువే విచారణాధికారి... కేజ్రీవాల్ పై బ్రహ్మాస్త్రం!


ట్యాంకర్ స్కామ్ లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై విచారణ జరపాలని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఏసీబీని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఏసీబీ చీఫ్ గా ఉన్న ఎంకే మీనా ఈ కేసును స్వయంగా విచారించనుండగా, ఆయన కేజ్రీవాల్ కు బద్ధ విరోధి. మీనాను మించిన అవినీతిపరుడు లేడని, తన ప్రభుత్వంపై పెత్తనం చేసేందుకే ఆయన్ను నియమించారని రెండేళ్ల క్రితం కేజ్రీవాలే స్వయంగా ఆరోపించారు. ఆయనపై శాఖాపరమైన విచారణ జరిపించేందుకు కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలపై తాను కోర్టును ఆశ్రయిస్తానని అప్పట్లో మీనా హెచ్చరించారు కూడా.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే, ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ నుంచి రూ. 2 కోట్లను ముడుపులుగా కేజ్రీ తీసుకుంటూ తన కళ్లబడ్డారని బహిష్కృత మంత్రి కపిల్ శర్మ ఆరోపించి, అందుకు ఆధారాలను ఏసీబీ, సీబీఐ, ఎల్జీలకు అందించిన సంగతి తెలిసిందే. దీంతో విచారణ అధికారిగా మీనాను నియమిస్తూ ఎల్జీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మీనా ఎలా వ్యవహరిస్తారన్న విషయం అటుంచితే, ఓ రకంగా కేజ్రీపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినట్టేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

  • Loading...

More Telugu News