: స్థలం లేకనే విశాఖను వదిలి రాయపూర్ వెళ్లాం: చంద్రబాబుతో యూఎస్ బీపీఓ సంస్థ పట్రా కార్ప్
నవ్యాంధ్రకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా అమెరికాలో చంద్రబాబునాయుడు పర్యటిస్తున్న వేళ, ఓ ఆసక్తికర విషయం జరిగింది. బీపీఓ సేవల సంస్థ పట్రా కార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాన్ ఎస్ సింప్సన్, చంద్రబాబుతో సమావేశమై, తమ సంస్థ ఏపీలో విస్తరణ పట్ల ఆసక్తిగా ఉన్నప్పటికీ, స్థలం లభించక వెనుదిరిగిన విషయాన్ని ప్రస్తావించారు. విశాఖలో కేంద్రాన్ని పెట్టి ఇప్పటికే 1500 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, తగిన స్థలం ఉంటే మరో 500 మందికి ఉపాధిని కల్పించే వాళ్లమని చెప్పిన సింప్సన్, స్థలం లభించక రాయ్ పూర్ కు తరలి వెళ్లామని తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, పెట్రా కార్ప్ కు టెక్ మహీంద్రా బిల్డింగ్ ను కేటాయించాలని అక్కడికక్కడే ఏపీఐఐసీకి ఆదేశాలు జారీ చేశారు. ఆపై వీసా కార్డ్, బెల్ కర్వ్ ల్యాబ్స్, మొబిలిటీ ఇన్ ఫ్రా తదితర కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు చర్చలు జరిపారు.